Pages

31 July 2012

పవిత్ర ప్రపంచo



యాదృచ్చికమై,నిను చేరి,
శాశ్వితమై నిలిచే,
ఏ సత్యమూ,
నీకిక్కడ గోచరించదేమో.
ప్రపంచం మొత్తాన్ని,
పవిత్రంగా వుంచగలిగింది,
నీ పవిత్రతేనని,
నీవు నమ్మనంతకాలం,
ఏ పవిత్ర ప్రపంచమూ,
నీకు పవిత్రమై మిగలలేదేమో,సుమా.



30 July 2012

బేషరుతుప్రేమ



ఊహాతీతమైన మధురచైతన్యం,
మధించిన అంతరంగిక ఆలోచనల
అంతిమ ఉత్తమ ఫలితం,
ఒక సజీవమైన ప్రేమసూత్రం,
ఆనందమైన జీవిత స్థిరత్వానికి
ఒకే ఒక బలమైన సాక్ష్యం,
బౌతిక జీవితపు ఏకైక సత్కార్యం,
ఏదైనా వుందంటే సుమా,
అది ప్రేమంచడం మాత్రమే,
ద్వేషరహితమైన ప్రేమ మాత్రమే,
బేషరుతుగా తోటి మనిషిని ప్రేమంచడం మాత్రమే.

29 July 2012

అంతర్జాలం-మాయాజాలం,ద్విపదలు



అంతర్జాలం, ప్రపంచమే కుగ్రామం.
మాయాజాలం, పక్కిల్లే, మరో ప్రపంచం.
 ---------------------
నెట్ లో నానీలు పెట్టు.
చదివే చేపల్ని, జల్లించి పట్టు.
---------------------------
పక్కంటోడిని పలకరించడు కాని,
అజ్ఞాత అమెరికన్తో, గంటల కొద్ది చాటింగ్.
--------------------------
రాకుమారుడు, గుర్రం పై లోకసంచారం.
పకపకమంది, బ్రౌజింగ్ ఎలుక.

28 July 2012

మరిచిపోకు నన్ను, సుమా.



ఒకానొక ఫీలింగ్ – 31

చెదిరిపోకు కలలాగా,
కరిగిపోకు హిమలాగా,
నిలిచిపోకు దూరానే,
మరిచిపోకు నన్ను, సుమా!!

27 July 2012

నాన్నా, నీకెప్పుడు రెండో ర్యాంకే.




నా ఆకలి గర్భాన్ని
నీ రెక్కల కష్టంతోను,
నా చీకటి అగాధలను
నీ జ్ఞానపు వెలుగులతోను
నింపావన్నది, ఎంతో కొంత సత్యమైనా,

నా జీవిత శిల్పాన్ని,
 రాత్రింబగల్లు  కష్టపడి చెక్కేవని,
నా వ్యక్తిత్వం మొత్తాన్ని,
ఆకాశమంతా ఎత్తున నిర్మించిన
మహోన్నత వ్యక్తి నీవని,
కొంత ఎక్కువ చేసైనా,
ఎంత ఉదాత్తంగా చెబుతామన్నా,

కడుపు కర్మాగారంలో
నాకో రూపాన్ని దిద్దిందనో,
ఈ పాపపు ప్రపంచం నుంచి
తొమ్మిది నెలలు భద్రంగా కాపాడిందనో, 
నొప్పుల వేదన మరిచి,
నన్ను నవ్వుతూ హత్తుకుందనో,,

ఎందుకో నాన్న,
అమ్మ ముందు నిలబెడితే,
నీకెప్పుడు రెండో ర్యాంకే.



(శ్రీ గారి ఫాదర్స్ డే కవిత స్ఫూర్తితో)
(ఈ బ్లాగుల సేకరణని చూడండి. http://100telugublogs.blogspot.in/)

25 July 2012

తెలుగు బ్లాగుల గీతం.(బ్లాగర్లకు మాత్రమే )




మా బ్లాగులమ్మకు లక్ష పూలాజల్లు
మన తెలుగు బ్లాగుకు నీరాజనాలు.
తెలుగు బ్లాగుల వృధ్ది  - మన భాష అభివృధ్ది
మనందరీ బుద్ది – కదలాలి అటు కొద్ది.
                                                        మా బ్లాగులమ్మకు...
ఎక్కడెక్కడి తెలుగు – ఇచటికే పరుగు
మన భాష వెలుగు – బ్లాగులతో పెరుగు.
చిన్నప్పటి కథలు – పెద్దవారి వెతలు
అనుభవపు పాఠాలు – చిలిపి ఆరాటాలు
అన్నిటిని ఇక్కడే వెతుకుతాము
ఎన్నెన్నో విషయాలు హత్తుకొని వెళ్తాము
                                                                 మా బ్లాగులమ్మకు...
బెల్జియం బెజవాడ – ఇంగ్లాండు, గుడివాడ
అమెరికా, మెక్సికో – దుబాయి,ముంబాయి
సఖినేటిపల్లి – ఆఫ్రికాలో పల్లి
కలకత్త, కనిగిరి – ఎచ్చోట మేమున్నా
                                                           మా బ్లాగులమ్మకు...
కలల ఊహల ఊట – సాహిత్య పూతోట
భావాల జడివాన - కురిసేను ఇచ్చోట
ఆకట్టు పోస్టులు - అలరించు కామెంట్లు
ఈ బ్లాగులా పంట - పండాలి ప్రతి ఇంట
                                                        మా బ్లాగులమ్మకు...
అపురూప కవితలు , చక్కని చిత్రాలు
సినిమాలు, గీతాలు, రాజకీయాలెన్నో
కళలు, విజ్ఞానాలు, కమనీయ విషయాలు
యాత్రవిశేషాలు, విశ్లేషణలు ఎన్నో
                                                         మా బ్లాగులమ్మకు...
తెలుగు భాషా శక్తి - బ్లాగర్ల ధీయుక్తి
విశ్వమంతా ఎగురు - తెలుగు బ్లాగుల కీర్తి
ఈ జీవితం మొత్తమూ ,ఇక బ్లాగులకే అంకితం
బ్లాగులే దైవమూ, బ్లాగులే మా ప్రాణమూ 

జై బ్లాగులమ్మ జై బ్లాగులమ్మ జైబ్లాగులమ్మ

సూచనలు
1. ప్రతి బ్లాగర్ల సమావేశం లో ప్రార్థనా గీతంగా పాడుకోవాలి.

2.తెలుగు బ్లాగుల గీతాన్ని గౌరవించి, ప్రచారం చేయాలి.

3. ఏ ఇద్దరు బ్లాగర్లు కలసినా జై బ్లాగులమ్మ అని అరుచుకోని, అభివాదం చేసుకోవాలి.

24 July 2012

ఒకానొక ఫీలింగ్ – 30



అధరాలను ముద్దాడిన,
చక్కనైన మురళిగాంచి,
హృదయమెంతో వగచింది,
నే వేణువు కాలేదని.

23 July 2012

పెళ్లైన ఆడపిల్లవు కదా,ఎంతైనా,



అబ్బా, వచ్చి ఎంత కాలమయ్యిందో,
నాలుగు రోజులు వుండి పోదువు గానీ,
ఒక్కసారి, రారాదు....
ఫోన్ల మీద ఫోన్లు,
నిన్ను చూడాలని వుంది,
ఓ పది రోజులు నీ సమక్షంలో,
ఆనందంగా వుండాలని వుంది.
నువ్వులేని జీవితం,
నిలువున ఎండిపోతుందని.

పుట్టినింటిని పచ్చగా చూడాలని,
పరుగెత్తుకుంటు వస్తావు, నీవు.
సంతోషపు పూలు పూయిస్తావు, నీవు.
అప్పుడప్పుడు,
రావడం, రావడమే విరుచుకుపడతావ్,
ఉదృతంగా, ఊపిరితిప్పుకోనికుండా,
జీవితం చెల్లాచెదురు చేసికాని, వెళ్లవ్.

అలిగివస్తావో, ఆమోదంతో వస్తావో..
అప్యాయంగా గుండెలకు,
హత్తుకోవడమే మా పని,
ఎలా వచ్చినా నీవు.
లోపల్లోపలే, వెళ్లేలోపు
ఏ ఉపద్రవాని సృష్టిస్తావేమోననే,
అనుమానం పీకుతూనే వున్నా.

ఒక వారం, మహా అయితే ఓ నెల,
భరించచ్చు నిన్ను,
నిరంతరం ఇక్కడుంటానంటే మాత్రం,
గుండెలు పగులుతాయ్,
ఎంతైనా, పెళ్లైన ఆడపిల్లవు కదా.

కష్టాల కడలిలో వున్నప్పుడు,
అమృతాన్ని కురిపిస్తావ్,
అకాలంలో వచ్చి,
అష్టకష్టాల పాల్జేస్తావ్.
ఎలా వచ్చినా, స్వాగతించడమే,
నువ్వొస్తానంటే వద్దనేంత కరుకుగా,
ఈ గుండెలు మారలేదమ్మ, ఇంకా.

ఆకాశ వరునికి, నీటి వధువుని,
కన్యాదానమిచ్చిన,
భూమాత స్వగతం ఇలానే వుంటుందేమో.


21 July 2012

హృదయనివేదన.


ఒకానొక ఫీలింగ్ – 30

క్షణక్షణం అనుక్షణం
నా మది తలపుల తలుపులు
తడుతున్న, నీ తలపులతో,
క్షణక్షణం ప్రతిక్షణం
నా హృదయ ద్వారాలను బంధించలేక,
నే పడుతున్న వేదనే, ఈ నివేదన.

20 July 2012

శిష్ ట్లా ఉమా మహేశ్వరరావుగారి వెన్నెల గీతం



ఇటు వెన్నెల      అటు వెన్నెల
నడి శిరస్సుకు  శ్రీ వెన్నెల
ఇటు వెన్నెల        అటు వెన్నెల
చిరునవ్వుల  కలవెన్నెల
ఇటు వెన్నెల        అటు వెన్నెల
విరులల్లిన  జడవెన్నెల
ఇటు వెన్నెల        అటు వెన్నెల
చెంగల్వల జిగి వెన్నెల
ఇటు వెన్నెల        అటు వెన్నెల
ఈశ్వరునికి  తలవెన్నెల
ఇటు వెన్నెల        అటు వెన్నెల
ఆకాశము మొల వెన్నెల
ఇటు వెన్నెల         అటు వెన్నెల
మనసుల్లో  మరువెన్నెల
ఇటు వెన్నెల        అటు వెన్నెల
ఎటు చూచిన కనువెన్నెల

ఇటు వెన్నెల అటు వెన్నెల
పిచ్చెత్తే, వళ్ళంతా వెర్రేత్తే
దిక్కులకై పరుగెత్తే నా మనసున,
వెన్నెల్లో ప్రేయసి లేక,
అమావాస్య అమావాస్య అమావాస్య
మహాలయ అమావాస్య .

(నవకవితకు ఆద్యుడు, విస్మరించబడ్డ గొప్ప కవి శిష్ ట్లా ఉమా మహేశ్వరరావుగారి గీతం ఇది,1938 లో ప్రచురించిన విష్ణుధనువు కవితా సంకలనం నుంచి. కవి పరిచయం తరువాతి టపాలలో చేస్తాను.)


19 July 2012

ఆడతనం-మగతనం-స్వేచ్ఛాపతనం - 2(on guwahati)






స్పందనల వర్షం కురుస్తుంది,
స్పందించి, స్పందిoచి,
స్పందనలు స్తంభించేదాకా,
ప్రతిదీ సాధారణీకరించబడేదాకా,
అప్పటి వరకు వర్షాకాలమే,
తరువాత శీతాకాలమే,
ఆపై వచ్చేది ఎండాకాలమే,
జీవితం చక్రభ్రమణమే.

వలల్లో ఇరుక్కున్నాక,
సోఫెస్టిఫికేషనే వుండదు.
మూలగాలి, గర్జించాలి,
కన్నీరు కార్చాలి, ఆలోచించాలి,
రహస్య ఒప్పందాలకు తెగబడాలి,
చివరుకు అలా వుండాల్సందే.
ఏ ప్రపంచంలోకి పరుగెత్తలేవు, ఊహలో తప్ప.
వున్నదాన్ని వున్నట్టే వుంచుకుందాం.
ముక్కు మూసుకొని, మన పని కానిస్తూ ఆనందిద్దాం.
ఇదంతా ఇంతే, ఏదైనా ఇంతే.

స్వేచ్ఛా జపం చేస్తూ,
ఇక్కడ భయాన్ని రేకెత్తించాల్సిందే.
దైవం పాటో,
దెయ్యం మాటో,
ఆయుధం పోటో,
ఏదో ఒకటి,
సమాజ రక్షకులుగా
బలమైనదాన్ని
బూచిగా చూపాల్సందే.
లేకుంటే ఇలా బలవ్వాల్సిందే.

సంఘటనల్లేని జీవితం,
స్పందనల్ని చంపేస్తుందటూ,
కళ్లల్లో వత్తులేసుకొని,
స్పందించే వారి కాలాలు నడుస్తున్నాయ్.

దుఃఖమూ కాదు, సంతోషమూ కాదు,
శాడిజం అంతకంటే కాదు.
ఏదో ఒక స్థితి,
నాకు మాత్రమే తెలుస్తున్న,
అర్థం కాని పరిస్థితి.
రోటిన్ ప్రశ్నలతో,
తలతిక్క వాదాలతో,
సుసంపన్నమైన అజ్ఞానాన్ని,
వేదికలపై ప్రదర్శించుకొంటు,
కాలం  గడిపేస్తుంటాం.

అటు చూడక, ఇటు చూడక
అది వినక, ఇది వినక
కదులు, కదులు, కదులు.
కళ్లు మూసుకొని,
నోరు కుట్టుకొని,
కదులు, కదులు, కదులు.
చెవులు కప్పుకొని,
రాత మానుకొని,
కదులు, కదులు, కదులు.
మెదడు నలగ్గొట్టుకొని,
నలుగురితో పాటుగా,
గొర్రలాగా, బర్రెలాగా, గానుగెద్దు లాగా,
కదులు, కదులు, కదులు.
కదులు, కదులు, కదులు.





18 July 2012

ఆడతనం-మగతనం-స్వేచ్ఛాపతనం.-1 ( on guwahati)




అక్కడా,ఇక్కడా ఎక్కడంటూ
ప్రశ్నలనవసరం.
నిన్ననో, మొన్ననో
రేపో, ఎల్లుండో
ఇప్పుడిప్పుడేనో,
నవ నవలాడుతూ, తాజాగానే
ఎదురవుతూనే వుంటాయ్,ఎప్పుడూ...
ఎక్కడెక్కడున్నాడో మనిషి,
అక్కడక్కడల్లా ఓ సంఘటన.
సమస్యను గుర్తు చేస్తుందో,
సమాధానాన్ని వెతికిస్తుందో,
మూలాలను అన్వేషిస్తుందో,
సమర్ధకులవో, వ్యతిరేకులవో,
అహాలను,
రెచ్చగొడుతుందో, తృప్తి పరుస్తుందో.
కొత్త భయాలనో, గోడలనో
సృష్టిస్తుందో అది.

అన్నీతెలుసు, మనకన్నీ తెలుసు,
విడమర్చి చెప్పాల్సింది, ఏమీ లేదు.
సెల్ లో సొల్లులు,
నెట్ లో బూతులు,
అర్ధరాత్రి పబ్ లు,
విసిరేస్తున్న విలువలు,
పారేస్తున్న జీవితాలు,
సగం విరిగిన ఆకాశాలు,
అంతులేని అవకాశాలు,
విప్పేసిన విచ్చలవిడి కళ్లేలు,
అన్నీతెలుసు, మనకన్నీ తెలుసు.
అసలైన దాన్ని,
ఎప్పటికి ఎత్తిచూపం,
మారడమూ తెలుసు,
మార్చుకోమూ, మన రూపం.
మారుతున్నట్లు భ్రమిస్తాం,
మార్చుకున్నట్లు నటిస్తాం.
ఒక మార్పు నుంచి ఇంకో మార్పులోకి,
ఒక భ్రమ నుంచి ఇంకో భ్రమలోకి,
విచారాన్ని వ్యక్తపరుస్తూనే వుంటాం,
ఏది, ఎప్పటికి, మనల్ని
సంతోషంగా మిగలనివ్వదు.

ఇదోక స్వేచ్చాపతనం,
ఆడతనం - మగతనం,
కాదూ, కాదూ, కాదు,
ఎంత మాత్రం కాదు,
స్వేచ్చ యొక్క పతనం,
నిజమైన స్వేచ్చాపతనం,
క్షుద్ర ఆనందాల్నే జీవితమనుకొనేతనం,
ఇది,సిగ్గు పడాల్సిన తరుణం,
ఇది, మన లోపలి మూడోతనం.

                                                                                                     ( ఇంకా వుంది, మిగిలినది రేపు).